6 రోజుల్లోనే కరోనా నయం చేస్తాడట!
posted on Apr 19, 2020 @ 6:15PM
గోవాకు చెందిన మహేష్ దెగ్వేకర్ వృత్తి రీత్యా టీచర్. రెండ్రోజుల క్రితం ఓ స్వప్న చూశాడట. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని షేగావ్‌కు చెందిన 19వ శతాబ్దపు హిందూ గురువు గజానన్ మహరాజ్ ఆ స్వప్నంలో దర్శనమిచ్చారు. కోవిడ్-19ని నయం చేయడానికి గజానన్ మహరాజ్ ఓ ఆయుర్వేద ఫార్ములా చెప్పారట.
అంతే ఈ విషయాన్ని ఆ టీచర్ తన సన్నిహితలతో షేర్ చేసుకున్నాడు. ఈ విషయం కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ దృష్టికి వెళ్ళిందట. అంతే మంత్రి గారు వెంటనే స్పందించారు. స్వయంగా దెగ్వేకర్‌ను కలుసుకున్నారు. దెగ్వేకర్ ఫార్ములా శాస్త్రీయతను తెలుసుకునేందుకు మంత్రిత్వ శాఖకు పంపుతున్నట్టు కూడా కేంద్ర మం త్రి ప్రకటించారు.
'గత ఎనిమిదేళ్లుగా ధ్యానంలో నాకు గజానన్ మహరాజ్ దర్శనమిస్తున్నారు. ఛాతీ నొప్పు, ప్రొస్టేట్లు సక్రమంగా పనిచేయకపోవడం, అధిక రక్తపోటు వంటి అస్వస్థతలకు ఆయుర్వేదంతో ఎలా నయం చేయవచ్చో ఆయన సూచిస్తుండే వారని దెగ్వేకర్ చెబుతున్నారు.
గత వారం ఒక విద్యార్థి తన వద్దకు వచ్చి కరోనా వైరస్ నుంచి విముక్తి కోసం గజానన్ మహరాజ్‌ను అడగాలని కోరాడు. ఆ తర్వాత 10 సెకండ్లలోనే స్వామి దర్శనమిచ్చి కరోనా నివారణ గురించి చెప్పారు' అని దెగ్వేకర్ తెలిపారు.
ఇంతకు కలలో స్వామి వారు చెప్పిందేమిటంటే... నిమ్మరసం, అల్లం రసం, జీలకర్ర పౌడరు, వెల్లుల్లి రేకులు, స్థానికంగా లభించే గుమ్మడి లేదా పుచ్చకాయ కలగలిపిన మిశ్రమం కోవిడ్-19 విరుగుడుకు మహత్మర ఔషధమని దెగ్వేకర్ తెలిపారు.
కోవిడ్-19 పేషెంట్ ఎవరైనా ఈ మిశ్రమాన్ని పుచ్చుకున్న మూడు రోజుల్లోనే ఫలితం కనపించడం మొదలవుతుందని, ఆరు రోజుల్లో పూర్తిగా నయమై, ఏడో రోజు ఇంటికి వెళ్లిపోవచ్చనని ఆయన వివరించారు.